Friday 6 November 2020

 కర్ణాటక శాస్త్రీయ సంగీతం : 5.

గానకళ   పరిణామక్రమం ..( evolution of music )....  మనిషి   ఎప్పటివాడో    గానకళ   కూడా   అంత   పురాతన మైనది.  మనిషే   కాకుండా   సృష్టి లోని   ప్రతీది   నాద మయమే . ఎదో  విధమైన సంగీత ధ్వని ప్రతి   కణమందునూ  ఉన్నది.  చిన్నదైన   గుండె చప్పుడు నుండి,  గంభీరమైన   మేఘ   ఘర్జన   వరకూ   అన్నీ   సంగీత  ధ్వనులే .   సెలయేళ్ల గల గల , సముద్రపు అలల   ఘోష,  కోకిల   కుహూరావాలు,  తుమ్మెదల   ఝుంకారము,  ఆవు  దూడల   అంబారావములు   అన్నీ   సంగీత నాదములే.


చారిత్రక   ఆధారములు   లభించినంత   వరకు  క్రీ. పూ . సుమారు   5 వేల సం. కిందటి దైన  ఋగ్వేదం ను   ఒకే శైలి   యగు   స్వరితలో   పాడుచుండెడి  వారు,  అది నేటి మధ్య షడ్జమం   కు   సరిపోతుంది... స .   తర్వాత  తర్వాత   ఋగ్వేదం   ఏకస్వర   కొలతకు   కింద  ( స్వరితం కింద )  అనుదాత్తం  .. ని  అనే  స్వరం ,  ఎగువన   ఉదాత్తం ... రి   అనే స్వరాలూ   కలిపి   పాడడం   మొదలు పెట్టారు.

ఏక స్వరం   లో  పాడే   ఋగ్వేద  గానం....ఆర్చిక   గానం ...స 

ద్విస్వరాలతో      ""         ""           ""  .....గాధిక  గానం ... ని  స 

త్రి స్వరాలతో        ""         ""          ""   ......సామిక  గానం ...ని  స రి 


ఇందులోని   మంద్ర  నిషాధం   అనుదాత్తం;   షడ్జమం   స్వరితం;   రిషభం    ఉదాత్తం .   కొన్నాళ్ళకు   మంద్ర స్థాయిలో   దైవతం,   మధ్య స్థాయిలో   గాంధారం   చేరి  పంచమ స్వర   కొలతగా    మారింది.   ఇంకా   కొంత   కాలానికి   మంద్ర స్థాయిలో  పంచమం,   మధ్య స్థాయిలో  మధ్యమం   చేరి  సప్తస్వర   కొలతగా  మారింది.   ఇదే   సామవేద   కాలము.

క్రీ. పూ.  3   వేల సం.   లో   ప ద ని స రి  గ మ    గా   స్థిరపడింది.   దీనినే   సామ గాన  మేళం   అంటారు.  ఇప్పటి   చిత్తరంజని   రాగం   ఈ  మేళం  కు దగ్గరగా  ఉంటుంది. ఈ రాగం  లో త్యాగయ్య   గారు  " నాద   తను  మనిశం "   అనే  కృతి   రచించారు.


సామగాన  మేళ  స్వరాలకు   కొద్దిగా   దగ్గరగా  ఉండే   నేటి   మేళ కర్తలు...భైరవి,   ఖరహర ప్రియ.  ప ద ని స రి గ మ  లో   ప ద ని స   అనే స్వర సంపుటి   మధ్యమ స్థాయిలో   కూడా   వచ్చినప్పుడు  ...నేటి   సప్త స్వరములు   స రి  గ  మ  ప  ద  ని     గా   మారినవి.  ఇది సంపూర్ణ మేళం  ( heptatonic   స్కేల్ ).  ఈ పరిణామం   భారతీయ సంగీత చరిత్రలో   గొప్ప మలుపు.   ఆ   తరువాత   షడ్జ,  గాంధార, మధ్యమ  గ్రామాలు,   ద్వాదశ,   షోడశ,  ద్వావింశతి   స్వర స్థానాలు,   72  మేళ కర్తలు ,  అసంఖ్యాక మైన  వాటి   జన్య రాగాలతో   నేటి కర్ణాటక   సంగీతం   సుసంపన్న మైంది .   ప్రపంచ   సంగీతం   లో   అగ్రగామిగా   నిలబడింది.

ఈజిప్ట్,  ఇరాక్-ఇరాన్ , గ్రీస్, చైనా, జపాన్, ఇండోనేషియా   మొదలైన    దేశాల  సాంప్రదాయ   సంగీతం   పాశ్చాత్య  సంగీత  ప్రభావానికి   లోనై   నేడు  దాదాపు   రూపు  మాసి  పోయాయి.

కానీ   దాదాపు 10 వ శతాబ్దం   నుండి   ముస్లిముల   దండయాత్రల వల్ల గానీ ,  వారి   రాజ్యాధికారం   వల్ల గానీ,  16 వ శతాబ్దం   నుండి   19 వ శతాబ్దం   వరకూ   ఆంగ్లేయుల  వలస అధికారం  వల్లగానీ   కర్నాటక   సంగీతం   ఏ మాత్రం   తన స్వంత  ప్రతిపత్తిని   కోల్పోకుండా, పైగా   ఎంతో   అభివృద్ధి   చెందింది.  పాశ్చాత్య   వాయిద్యాలు   అయిన   వయోలిన్,   మాండొలిన్ , సాక్షఫోన్   వంటి  వాటిని కర్ణాటక  సంగీతానికి బాణీకి   అనుగుణంగా   మార్చుకుని, మలుచుకుని   వాటిలో   ప్రావీణ్యం   సంపాదించి  కర్ణాటక  సంగీతం  లో  భాగంగా   చేర్చుకున్నారు  ఈ  కాలం   లో.   


ఇంకా   ఆశ్చర్యకరమైన  విశేషమేమంటే, భారతదేశం   ఆంగ్లేయుల   వలస పాలన లో   ఉన్న   కాలం లోనే   సంగీత   త్రిమూర్తులు,  వారి   శిష్య , ప్రశిష్యుల   వల్ల  కర్ణాటక  సంగీతం సుసంపన్న   మైంది.  ముత్తుస్వామి దీక్షితులు   పాశ్చాత్య  బ్యాండు  మేళం   విని   ( మేజర్  స్కేల్ - శంకరాభరణం )   స్వరాలతో   35  చిన్న కృతులు ( ముచుకుంద వరద ) రచించారు.

దీక్షితులవారు    బృందావన సారంగ   రాగం  లో   రచించించిన   ' శ్రీ  రంగపుర  విహార ' కృతి  బ్రిటిష్ జాతీయ   గీతమైన  ' ఓ  గాడ్   సేవ్  ది  కింగ్ '   పాటను   పోలియున్నది.

ఇన్ని  ఒడిదుడుకులను   తట్టుకొన  గలిగిన   కర్ణాటక   సంగీతం ...నేడు భారతదేశం   స్వాతంత్ర్య  దేశమైనా...సాస్క్రుతికంగా    పాశ్చాత్య   వాసనలకు   లోనై,  యువత  MTV  వంటి చానళ్ళ   ప్రభావానికి   లోనై   కర్ణాటక  సంగీతాన్ని   చిన్న చూపు   చూస్తున్నారు.  John  Higgins  లాంటి    పాశ్చాత్యులు     ఆరాదించి  సాధించిన   కర్ణాటక  సంగీతాన్ని మనం   దూరం   చేసుకోకూడదు.  అయితే  ఈ మధ్య కొన్ని   TV   చానళ్ళు   కర్ణాటక  సంగీతం   అభివృద్దికి   దేశ, విదేశాల్లో   పోటీలు   నిర్వహించి   యువతలో   ఉన్న ప్రతిభను   వెలికి  తీసుకొస్తున్నారు .  ప్రభుత్వం   కూడా   పాఠశాలల్లో   సంగీతం   ఒక   అంశంగా   తప్పనిసరి   చేస్తే...కర్ణాటక  సంగీతం  భవిష్యత్తులో   ఉజ్వలంగా  ఉండే అవకాశం   ఉంటుంది.


ఎవరు   మునిగినా   మునగక   పోయినా   భారత దేశం  లో  ఉత్తరాన   గంగమ్మ తల్లి ,  దక్షిణాన   కావేరి మాత  శతాబ్దాల   తరబడి   నిరంతరం   అప్రతిహాతంగా   ప్రవహిస్తూనే   ఉంటుంది.

 అలాగే కర్ణాటక    సంగీతం   కూడా............


స్వస్తి  ఇతిః.....శుభం భూయాత్.

No comments:

Post a Comment